First Love Letter To My Dear Grand Child..

  • 100592527_3155140644549541_4148597370352828416_n

💕First Love Letter to My dear Grand child💕

ఇదిగో… ఇపుడే కాఫీ కలుపుకుని వచ్చి తూర్పు గవాక్షం తెరిచానా… నారింజ రంగు సూర్యుడు ఎంత అందంగా వున్నాడో.. అనుకుంటూ కాఫీ గ్లాస్ అక్కడ పెట్టి మొబైల్ చేతిలోకి తీసుకుని రెండు క్లిక్ లు మనిపించి ఆ అందాల సూరీడ్ని ఫేస్ బుక్ గోడ మీద అందరికీ చూపించాలనే సౌందర్య ఆరాధన, ఆరాటం తీర్చుకుని .. కె జె ఏసుదాస్ మధురంగా ఆలపించిన శివ తాండవం (లాస్య) ని వింటూ చుక్క చుక్క కాఫీ ఆస్వాదిస్తున్న తరుణంలో… మీ నాన్న నుండి నాకు వాట్సాప్ కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిప్ట్ చేసి .. ఏం చేస్తున్నారు బంగారం, డిన్నర్ అయిందా… అని నా ప్రశ్న.

అమ్మా.. బేబి పుట్టిందమ్మా.. అని ఉద్వేగమైన మాటలు. అపుడేనా.. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమమేనా… అని అడిగాను కంగారుగా. ఎవ్విరిథింగ్ ఈజ్ ఫైన్.. అమ్మా. నీ కోడలికి c section జరిగింది. అని చెప్పాడు.. నాకు ఒకేపరి గంగయమునలు కళ్ళలో ఊరుతున్నాయి. వాటిని అణుచుకుంటూ.. అభినందించాను. ఉద్విగ్నతను అణుచుకుంటూ.. ఆశీర్వదించాను. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

బంగారూ… నువ్వు వచ్చే శుభవార్త ఎలా వచ్చిందో తెలుసా! .. మార్గశిర మాసపు గురువారం మునిమాపు వేళ రోజులాగా కాకుండా మరింత ప్రత్యేకంగా కామాక్షి దీపాలతో పాటు మరికొన్ని నూనె దీపాలు వెలిగించి .. ఆ దీపకాంతులు ఇల్లంతా చైతన్యశక్తిని నింపుతున్న వేళలో నేను శ్రీసూక్తం వింటున్న సమయంలో అదొక శుభ ఆశీర్వచనమై శుభతరుణమై .. మీ అమ్మ కాల్ చేసి.. “అత్తయ్యా… అమ్మాయి పుడుతుందంట” అని చెప్పినపుడు సంభ్రమం చెందానని చెప్పను కానీ క్షణకాలం తర్వాత సర్దుకుని.. నిండు హృదయంతో నీ రాకను ఆనందం చేసుకున్న క్షణాలు అవి. నిజం చెప్పొద్దూ.. నాక్కూడా వారసత్వ వ్యామోహం వుండింది. ఆ వ్యామోహాన్ని పటాపంచలు చేసి.. శుభసమయంలో మా ఇంట్లో మహాలక్ష్మి పుడుతుందనే వార్తను విన్నాను అని వెంటనే అయిన వాళ్ళందరికీ ఆ శుభవార్తను పంచుకున్నాను.

మీ నాన్న పుట్టినపుడు ఆడపిల్ల పుట్టలేదని ఏడ్చిన నేను.. నువ్వు పట్టే సమయానికి కాలానికి ఆడపిల్ల కాకపోతే బావుండుననుకునే కాలానికి నెట్టబడ్డానని అనుకుంటాను.. బంగారూ.. నా ఆలోచనలో తప్పు వుందని నేను అనుకోను కానీ.. నీ రాకను నీ లాంటి ఆడబిడ్డల రాకను మనఃస్పూర్తిగా ఆహ్వానిస్తాను తల్లీ..!

మా ఇంటి మహలక్ష్మివి నీవు. నువ్వు పుట్టావన్న వార్తను తొలుతగా నాతో పంచుకున్న నాకే వినిపించిన మీ నాన్నకు తెలుసు.. మీ నానమ్మ నీ కోసం ఎన్ని కలలు కంటుందో.. నువ్వు మీ నాన్న లాగే వుంటావని నేను అనుకుంటే.. అమ్మా.. బేబీ నీలాగానే వుందమ్మా, వ్రేళ్ళు కూడా నీకు లాగానే వున్నాయమ్మా అని మురిసిపోతున్నాడు. నిన్ను ముందు మీ అమ్మ చూసిన తర్వాతే మాకెవరికైనా చూపమని నేను హెచ్చరిక చేసాను. మీ అమ్మ నాన్న నా రెండు కళ్ళు అయితే.. వారి కలల పంటవి.. నువ్వు నాకు పంచప్రాణాలు బంగారూ.. మీ అమ్మనాన్న ఏ పేరైనా పెట్టుకోనీ.. నేను నీకు పెట్టుకున్న పేరు “చిత్కళ”. శ్రీ శార్వరి నామ సంవత్సర చైత్ర శుద్ద విదియ బుధవారం 07:13 pm కి రేవతి నక్షత్రం నాల్గవ పాదం మీనరాశిలో జన్మించిన నీకు.. శుభాశీస్సులు బంగారూ.. ఆ శ్రీగిరి పర్వతం నుండి జగత్ మాతాపితురుల కరుణ కటాక్షాలు నీపై సర్వకాలాలు ప్రసరిస్తూనే వుంటాయని నా ప్రగాఢ విశ్వాసం.

నేను చూసుకున్నట్టే నా కొడుకుని భద్రంగా ప్రేమగా చూసుకోవటానికి నువ్వు వచ్చావు తల్లీ..

అమ్మా.. నన్ను వదలవే తల్లీ.. ఎక్కడో దూరంగా వున్నావనుకున్నా.. ఇదిగో ఇక్కడ కూడా నా కూతురి రూపంలో వుండి అనేక జాగ్రత్తలు చెప్పి సాధిస్తున్నావే .. అని మురిపెంగా.. మీ నాన్న చెప్పే మాటలను మధురంగా.. ఊహించుకుంటున్నా.

ఈ కరోన కాలం కాకపోతే నిను భద్రంగా మృదువుగా అపురూపంగా ఒడిలోకి తీసుకుని లాలించాల్సిన నానమ్మను. ఉయ్యాలలో పడుకుని కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏదో రహస్య భాషలో ఎదురుగా వున్న మీ నాన్నతో సంభాషిస్తున్న నిన్ను మొబైల్ కెమెరాలో చూస్తూ ఆ చూపునుండి హృదయం దాకా ప్రవహింపచేసుకుని గుండెతో గుండెను కలిపి భద్రంగా ముడి వేసుకున్నా బంగారూ..

మీ నాన్న కన్నా ప్రియమైనదానవు.. నిను ఒడిలోకి తీసుకుని ఆ పౌత్రి ప్రేమను నిండుగా ఆస్వాదిస్తుంటే.. నువ్వు నా చిటికెన వేలును నీ చిన్ని గుప్పిటలో బిగించి పట్టుకుంటుంటే.. నేను రాసుకున్న అమ్మ మనసులో మాట లేదా సాయం చేయడానికి చేతులు కావాలి అన్న కవితలు మదిలో మెదులుతుంటాయేమో మరి.

బంగారూ… ముందు ముందు నా ఊహలు నా ఆశలు నా ఆకాంక్షలు అన్నీ వినే శ్రోతవి నువ్వే. అందుకే.. ఈ అక్షరాలలో నా మనసు మాటలను భద్రం చేస్తున్నా.. తర్వాతెపుడో చదువుకుంటావు కదా..

💕 ✍️ప్రేమతో .. నానమ్మ.🎈🎈💕

IMG_E3822

రస స్పర్శ

నిశ్శబ్దం నిశ్శబ్దం .. భయంకరమైన నిశ్శబ్దం. నా  లోలోపల మాట్లాడుకునే మాటలే నాకు వినబడని నిశ్శబ్దం.  అమావాస్య రాత్రిలా  నన్ను చుట్టేసిన నిశ్శబ్దం. మైనస్ డిగ్రీలలో వెచ్చని రజాయిలా నన్ను అంటిపెట్టుకున్న నిశ్శబ్దం. నిశ్శబ్ధంలోనుండి  నిశ్శబ్దంలోకి ప్రయాణిస్తూ నేను. ప్రచండమైన మనో వేగంతో యిల్లు నగరాలు దేశాలు ఖండాలు దాటి దట్టమైన  కీకారణ్యంలో ప్రవేశించాను. అక్కడ కూడా నిశ్శబ్దమే. నేను మనుషులకి దూరంగా కదా పారిపోయి వచ్చింది. ఇన్నాళ్లు వాళ్లకి ఇష్టంగా నాకు కష్టంగా వాళ్లకి కష్టంగా నాకు ఇష్టంగా మాట్లాడే శబ్దాల నుండి వెఱచి చేస్తున్న ప్రయాణం కదా యిది. పక్షుల కిలకిల రవాలని  కూడా అసహ్యించుకున్నానేమో..అవి కూడా వినబడని గాఢమైన నిశ్శబ్దంలో దారీతెన్నూ లేక నడుస్తూనే వున్నాను. ఊటలా పుట్టే ఆలోచనలపై కూడా  నిశ్శబ్దమనే పెద్ద బండపడి యెందుకు నడుస్తున్నానో తెలియని  సృహలో  నిసృహగా నడుస్తూనే వున్నాను. అలా పగలురాత్రెరుగని ప్రయాణంలో నిస్సత్తుగా మారి శరీరం గాలిలో తేలిపోతూన్నట్లు అనిపించి  కాసేపు విశ్రమించాలని అనుకున్నాను. ఉన్నచోటనే పడిపోయాను. రాళ్లు ముళ్ళు వున్న సృహే  లేదు.


ఆ అచేతనావస్థలో అకస్మాత్తుగా   చెవులనుండి ఆత్మని చేరిన సంగీత ప్రవాహం. అనాదిగా వున్న నిశ్శబ్దంలో నుండి జనియించిన శబ్దం. అది సృష్టించిన అలజడిలో నుండి మేల్కొని చుట్టూ పరికించి చూడాలనుకున్నాను. కానీ కనులు తెరవలేకపోతున్నాను.నా విశ్రాంతిని,  నిశ్శబ్దాన్ని భగ్నం చేసిన ఆ శబ్దంపై  అంతులేని ద్వేషం కల్గింది. పైకి లేవలేక కుప్ప  కూలి పోయాను. లోకంలో వూరేగాల్సిన గాలినంతా యెవరో  పోగేసుకున్నట్లు దానిని పూరించి శబ్దాన్ని సృష్టిస్తూ వున్నట్లు అనిపించింది. వింటూ వింటూ నుండగా  ఆ  నాదంలో యేదో మహత్తర శక్తి వుందనిపించింది .  క్రమేపీ ఆ శక్తి నాలో ఆణువణువూ ఆక్రమించింది. నన్ను  నిద్రాణంలో నుండి బయటపడేసిన ఆ శబ్దాన్ని సృష్టించిన  వైతాళికుడిని చూడాలనుకుని లేచి కూర్చున్నాను.  ఈసారి శ్రమ పడకుండానే కళ్ళు మాములుగా తెరుచుకున్నాయి. మైళ్ళ దూరందాకా  విస్తరించిన ఊడల మఱ్ఱి చెట్టు మొదలునానుకుని విశ్రాంతంగా రాజసంగా కూర్చున్నాడతను. అరమోడ్పు కన్నులతో వెదురుకర్రపై వేళ్ళు కదిలిస్తూ పెదవులతో గాలిని ఊయిస్తూ లోకాలలో పనిలేనట్టు తన లోకంలో మునిగిపోయి వున్నాడు.  నాకు దాహంగా వుంది అని అరిచాను.  అతను ఆ వెదురుకర్రని వూదటం ఆపేసి నెమ్మెదిగా లేచొచ్చి  తండ్రిలా నా చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకెళ్లి  సముద్రం ముందు నిలబెట్టాడు. అతన్ని పట్టించుకోవడం మానేసి సముద్రాన్ని చూస్తున్నా. కెరటాలు వువెత్తున్న వచ్చి భూమిని తన తలతో కసితీరా బాది  వెనక్కి వెళుతున్నాయి. అలసిపోతూ వున్నాయి. మళ్ళీ అంతలోనే వొచ్చి  తనప్రతాపం చూపుతున్నాయి.  ఎందుకో భూమిపై జాలేసింది. సముద్రం పొగరు అణచాలనిపించింది.


సముద్రానికి స్ట్రా వేసి తాగుతున్నా ..తాగుతూనే వున్నాను. ఎంత తాగినా దప్పికారడం లేదు. సముద్రమంతా యెండిపోతుంది.చేపలన్నీ,తిమింగలాలన్నీ యెగిరిపోతున్నాయి. నక్షత్రాలన్నీ నా చుట్టూ వెలుగుతున్నాయి. కనిపించినంతమేరా పూలపొదలు,ముత్యాల, పగడాల, బంగారు రాసులు. చిన్న పువ్వునైనా కోసుకోవాలని కానీ ముత్యాల  పగడాల రాశులని  తాకాలని కానీ నాకనిపించలేదు.  ఒక్క క్షణం నేనెవరిని ..అసలు నాకూ ఈ లోకానికి సంబంధమేమిటీ అన్న సందేహం వచ్చింది. తెలుసుకోవాలనిపించింది. మరుక్షణంలో అసలీ లోకంతో నాకు పనేమిటీ, నేను నేనే. నేను మాత్రమే నిజం అన్న అహం ఆవరించింది. తలెత్తి చూసాను. భూమి చాలా మైళ్ళ యెత్తులో,శిఖరాలు అంతకన్నా యెత్తులో కనబడుతూ వున్నాయి. నేనిక్కడ దాకా యెందుకు వచ్చాను,  అసలక్కడ లేనిది యిక్కడ వున్నది యేమిటన్న  సందేహం ముంచుకొచ్చింది. హఠాత్తుగా నాలోపల ఒక మనిషి వున్నాడని గుర్తుకువచ్చింది . వాడికి అన్నీ వున్నాయి అనుకోగానే  ఆకలి గుర్తుకొచ్చింది.  చుట్టూ చూసాను. తినదగిన ఆహార పదార్ధాలేవి  యేవీ కనబడలేదు. ఆఖరికి నీళ్లు లేవు, గాలి లేదు. ఏవీ లేవు.  కానీ నేనున్నాను. అసంతృప్తి నిండిన నేనున్నాను.  నాకేమికావాలో తెలిసిన సృహలో  కొంత వినయంగానూ, తెలియని అజ్ఞానంలో కొంత అమాయకంగానూ, నాకేమి తెలియాల్సింది లేదన్న అహంకారంతో  కొంత నిర్లక్ష్యంగానూ సంచరిస్తూనే  వున్నాను.


ఉన్నాను అలాగే సంచరిస్తూనే వున్నాను.మంటలు మంటలు నా చుట్టూతా మంటలు మంటలమధ్య కూడా నడుస్తూనే ఉన్నాను.అందులో దహించబడతున్నానేమోనని   భయం కల్గింది కానీ నాకు ఇసుమంత వేడి తగలడంలేదు దూదిలా తేలి తేలి పోతున్నాను. ఎందుకంటే నాలో ఉన్న ఆరునదులను దాచుకుని వున్నందునేమో. ఆ ఆరు నదులు అగ్నికి లోబడి దహించనిదే నేను చేరుకోవాల్సిన గమ్యం నాకు కనబడదేమోనన్న దిగులు ఆవరించింది .   నిరాశగా నడుస్తూనే వు న్నాను. కొన్నాళ్ళకి   ఆ అగ్ని శిఖల మధ్య అతను. చిత్రంగా అతని చుట్టూ ఒక చీకటి  వలయం. ఆవలయంలో కూర్చుని శిల్పాలు చెక్కుతూనే వున్నాడు అతని చుట్టూ వున్న బండరాళ్ళన్నీ  శిల్పాలు గా మారుతూనే వున్నాయి..కొన్నాళ్ళకి  ఆ శిల్పాల అర చేతిలో దీపపు ప్రమిదలని  చెక్కుతున్నాడు. చెక్కడం పూర్తైన తర్వాత నోటితో ఉప్ మని వూది వాటినన్నింటిలో  నూనెని నింపాడు.  తరువాత  అన్నింటిని చేతితో తాకుతూ వెళుతున్నాడు. దీపాలు  వెలుగుతున్నాయి  కానీ కానీ అక్కడ వెలుగు లేదు. అక్కడ  ఆవరించిన భయంకరమైన  చీకటిలోకి  వూపిరి ఆడటంలేదు. దీపాలని వెలిగించి వెలిగించి అతను చెట్టుని ఆనుకుని కూర్చుని వెదురుకర్రని ఊదడం మొదలెట్టగానే దీపాలన్నీ వెలుగుతున్నట్లు గాలికి వూగుతున్నట్లు కనబడింది నాకు. విసుగనిపించింది. మెల్లగా ఆ వలయం మధ్య నుండి బయటకి చేరుకున్నాను  అక్కడపుడు అగ్ని లేదు. మళ్ళీ సంచారం. 

 

కొన్నాళ్ళకి  ఓపిక సన్నగిల్లింది. తూలిపడిపోబోతున్న నన్నొక ఆత్మీయ హస్తం పట్టుకుని నిలబెట్టింది. మెత్తని  పచ్చిక తివాచీపై కూర్చుండబెట్టి ఈ లోకానికి అతిధిగా వచ్చావ్, క్షుద్భాధతో అలమటించడం నాకు బాధ కల్గిస్తుంది. రా .. వచ్చి ఆరగించు అన్నాడు  చేతితో దగ్గరగా వున్న రకరకాల ఆహారపదార్ధాలవైపు చూపుతూ.   తొలిసారిగా నాతో మాట్లాడుతూన్న అతని వైపు చూస్తూ    ఓహ్ ..నన్ను  ఇప్పుడితని అతిధిని అంటున్నాడు. అతిధి మర్యాదలు చేయకపోతే నామోషీ గాబోలు, కనీసం  ఆకలి తీర్చేటప్పుడైనా అమ్మలాగా అనిపించ వచ్చు కదా !  ఆ ఆహారపదార్ధాలలో కాస్త మధురమైన ప్రేమని రంగరించి  కొసరి కొసరి తినిపించవచ్చుకదా !  ఏదో మొక్కుబడిగా పిలిచాడు. నేనెందుకు వెళ్ళాలసలు అని బీరాలు  పోయాను.  ఆకలి సంగతి మరిచి ఆసలెక్కడికి వెళ్లినా అతనే యెందుకుంటున్నాడో అని ఆలోచన చేస్తూ ఆ ఆహార పదార్ధాలనుండి దూరంగా జరిగి  వో  రాతిపై కూర్చుండి పోయాను.


అతను ఎప్పటిలాగానే   చెట్టు క్రిందనే కూర్చుని దట్టీ లో నుంచి వెదురు కఱ్ఱని తీసి పెదవులకి ఆనించాడు. ఎప్పటిలాగానే నేనొకరకమైన  మైకంలో  కనులు మూసుకుని పోతుండగా నా అంతరంగం ఒకటి గుర్తుచేస్తుంది.ఈ సుందర వుద్యాన వనాలు, లతలు, ఫల పుష్ఫాదులు, ముత్యాల పగడాల రాసులు, గాలిలో తేలిపోయినట్లుండే యీ సంగీతం వినడం,మధుర పదార్ధాలు ఆరగించడం యివేమి కాదే నేను కోరుకున్నది. నాకు కావాల్సినది మరేదో, అదేమిటో హృదయానికి తెలుసు కానీ ఆలోచనకేమాత్రం అందనంటుంది.  శతాబ్దాల విరహంతో మనసు వేగిపోతుంది. హృదయం అలమటిస్తుంది.  ఆ యాతనని  చెప్పటానికి సమయం ఆసన్నమైంది కానీ నోరు పెగలనంటుంది. ఎట్టకేలకూ  అంతరంగంలో జ్వలిస్తున్న కోరిక ముందుకు తోసుకొచ్చింది. అవును నేను నా సఖుడిని కదా కోరుకున్నది. అతడే యీతడు కావచ్చు కదా అని తోచింది. తోచినదే తడవుగా  నేను నా అహాన్ని  త్యజించి బిడియం విసర్జించి  అతడు మాత్రమే సత్యం అన్నది  గ్రహించి జ్ఞాన వస్త్రాన్నికప్పుకుంటూ చేతులు చాచి  రా రమ్మని ఆహ్వానిస్తూ  అతని ముందుకు నడిచాను. అతను నా వైపు చూడనైనా చూడలేదు. తన లోకంలో తాను మునిగి వున్నాడు.  నాచుట్టూ మాయమైన సముద్రమంతా దుఃఖంలా మొలుచుకొస్తుంది. అందులో నేను మునిగిపోతున్నాను. దీనంగా అతనిపైనే దృష్టి నిలిపి నీ బాహుబంధాల మధ్య క్షణమైనా నన్ను విశ్రమించనీయి. ఎన్నివేల లక్షల   యోజనాలు తిరిగి తిరిగి వెతికాను నిన్ను. నిన్నిప్పుడే తెలుసుకున్నాను. నీ సమక్షంలో  గొప్ప శాంతిని పొందిన అనుభవాన్నిరవంతైనా  మిగలనీయ కూడదా, వేదనతో అలమటిస్తున్న నా  ఆత్మ రోదన వినిపించడం లేదా అని మౌనంగా నా మాటని  నివేదిస్తున్నాను. కళ్ళనిండా వున్న నీళ్లని కమ్మేస్తూ మహా సముద్రం నన్ను ముంచేసింది.


సృహ వచ్చి చూసుకునే సరికి అతని ఆలింగనంలో నేను.  నన్ను రక్షించాడతను.సంతోషంతో నిలువెల్లా వూగిపోయాను.  సఖా ! నేను నువ్వు వేరు  వేరు కాదు  కదా,  మనం ఆత్మ ముద్రలం కదా అని గుస గుసగా అడుగుతూ, నా స్వరం నాకే కొత్తగా వినబడుతుంటే ఆశ్చర్యంగా కనులు విప్పాను. నాతలకి దగ్గరగా అతను  తలని వొంచి  దయాపూరితమైన ధృక్కుతో వాత్సల్యంతో నన్ను చూస్తూ   నీ అశాంతి మాయమైందా  అని అడిగాడతను . మాయం చేయడం నీ చేతిలో పని కదా, మళ్ళీ అశాంతి వొడ్డున నన్ను వొదిలేయకు. నన్ను నీ ఆలింగనంలోనే బంధించి ఆ పారవశ్యసౌఖ్యాన్ని శాశ్వతం చేయి అన్నాను. అతను మాట్లాడ లేదు. తలనెత్తి సాలోచనగా పైకి  క్షణకాలం   చూసి కనులు మూసుకున్నాడు. ఆ గడ్డం క్రింద  నొక్కుని చూస్తూ అతన్ని మరింత గట్టిగా హత్తుకోబోయాను. సుతిమెత్తని స్పర్శలో యేదో లోపించింది. మరుక్షణం మనసుకి  వుక్కపోసినట్లయింది. అప్రయత్నంగా అతని నుండి విడివడ్డాను.క్షణంలో నన్నావరించిన తేజస్సంతా తటిల్లతలా మెరిసి గాఢాంధకారంలో కలిసిపోయింది.  అర్ధమైంది,నేను అలమటిస్తున్నాననే జాలి దయతోనే  అతను నన్ను దగ్గరకి తీసుకున్నట్లు.   సంపూర్ణమైన ప్రేమతో  అక్కున జేర్చుకోని అతని  ప్రియ సాన్నినిధ్యం  నాకు మాత్రం వెగటు కల్గించదూ. పొతే పోనీయి లే అని నన్ను నేను స్థిమిత పరుచుకున్నాను. మరుక్షణంలోనే  నా ప్రేమలో నిస్వార్ధం, నా వాంఛలో పరిపూర్ణం గోచరించనిదే అతను మాత్రం యెలా స్వీకరించగలడు అని ప్రశ్నించుకున్నాను.  అతను క్రమేపీ నా మానసంలో నుండి కూడా అదృశ్యమై పోయాడు. వెనువెంటనే  అవ్యక్తమైన  దుఃఖం నన్నావరించింది. మృత భారమైన శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ వున్నాను.ప్రేమించడం అంటే మనని మనం గాయపరుచుకోవడమేకదా! గాయాలను మాన్పుకుంటూ మరింత ప్రేమించడమనే మార్గం ద్వారానే అతన్ని చేరుకోగలననిపించింది.


దేహం పొరలు పొరలు  తొలుచుకుంటూ నెమ్మెదిగా బయటకి వస్తుంది. తడిచిన మోచేయి చల్లగా ముఖానికి  తగులుతుంది.ఎవరో పై అంతస్తులో గతా గతా నడుస్తున్న శబ్దం. తోడుగా తలుపుపై మునివేళ్ల శబ్దం.బలవంతంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి యెదురుగా ఉన్న కిటికీ వైపుకి చూసాను. దూరంగా గాలికి కదులుతున్న ఫైన్ వృక్షపు కొమ్మలు. అద్దాల తలుపులని బద్దలు కొట్టుకుని మరీ వచ్చిన   బుచుకు  బుచుకు మనే శబ్దం. అప్రయత్నంగానే లేచి కిటికీ ప్రక్కన నిలబడి  అద్దానికి ఆవల చూస్తే రోజ్ గ్రీక్ పూల పొదలపై తుమ్మెదల సంచారాన్ని చూసిన ఆనందంతో పేటియా రైలింగ్ పైన చక్కర్లు కొడుతూ గొంతువిప్పిన పక్షి.  తిరిగి మొదలైన అవుట్ ఫుట్ రొద. దూరంగా కూతవేస్తూ వెళుతున్న లోకల్ ట్రైన్ నా లోపలి  నిశ్శబ్దాన్ని పూర్తిగా భగ్నం చేస్తూ.                            (ఇదొక అనుభవైకవేద్యం)

లిప్త క్షణాలు

 

ఈ తొవ్వకేమి తెలుసు

ప్రతి తలపు నీ వైపుకే నని

తనే మనసై నీ దరికి చేరనున్నదని.

 

***

నీ గురించి ఆలోచిస్తూ

నన్ను నేను గాయపర్చుకుంటూ..

ఆ గాయాలపై ఉప్పు జల్లుకుంటున్నానని

*****

కాయానికేనా తనని తాను మోసుకునే బాధ

గుండెకెంత వ్యధ

తన సొదని వినే తోడు లేక.

*******

తూట్లు తూట్లు పొడుచుకుంటుంది

రక్తాన్ని తుడుచుకుని కుట్లు వేసుకునేది నేనే

నువ్వు  కేవలం నిమిత్రమాత్తుడివి.

**********

ఊహల చెలమలో కథలు వూరుతుంటాయి

కాసిని తొలుపుకుందామంటే

గులకరాళ్ళ గోటి గిచ్చుళ్ళు

************

అంతరాత్మ భాష అసలు భాష

చిత్రంగా

దానికి నవరసాలు తెలుసు

****************

చేరుకునేదాకనే దూరం

దగ్గరైనాక ఆవలికి జరగడం

కళ్ళపై చేయడ్డుపెట్టి వెతుకుతుంటాం ఇంకో గమ్యం కోసం.

 

ME IN MY SOLITUDE

జగతి జగద్ధాత్రి గారి ఆంగ్ల అనువాదంలో నాకవిత.

ME IN MY SOLITUDE

Who says solitude is loneliness?

It is the hundred thousand’s vision

Of me looking into myself

It’s the great revelation of

Embracing my soul

To describe aloneness is

To chisel the thoughts

To adorn the letters

It’s not filling colors to the paintings

The time

When the lights are off

When the flowers fall down

When the dawn flower blooms

That’s when my solitude mingles

With my aloneness

As the light spreads around the lamp

Around me and in me it’s my solitude that surrounds

Shameless dreams always wait

To disturb my seclusion

As the pains drench the heart book

Solitude is always a brook that never comes to light

Changing the

Hopes that fall as stars

Sweet moments that are held with tact

Moss grown bitter memoirs

Into pebbles

Throws into the ignorant seas

Leaves me ashore

With an over smartness

Not to show any other footprint in my heart forest

With an untouchable attitude

Except for me to touch

Exhausts with the

Labor of umpteen thoughts

Shatters with the explosion of emotions

Flowing as secretions

Breathes in the air of my outer world

Rolling along with the times

Remains a residue

Leaving a little space in my begging bowl

For my tomorrow’s solitude

Holds me as a human

Telugu original : NAA EKAANTHAM LO NENU

English trans: Jagaddhatri … 12.58 pm 24/9/2018 Monday

379AEA7A-3082-4E14-A900-23516506BAB3

సౌందర్యానుభవం

 

అందమైన హృదయం ఉన్న వారికి అన్నీ అందంగానే కనబడతాయని నానుడి.అలాగే అందంగా కనబడని వాటిని నిర్విద్దంగా తిరస్కరిస్తారని కూడా అంటూంటారు.

“అతనెంత అందంగా ఉంటాడు” అని స్త్రీలు  బహిరంగంగా ప్రకటించడం కూడా నిషిద్దం కొన్ని కుటుంబాలలో అయితే  చూపులతో ఉరి వేసేస్తారు మరి.

ఈ మధ్య నా ఫ్రెండ్ ఇలా అంది ” వాడు అందంగా ఉండేవారికి వలవేస్తాడు ఆ అందాన్ని అడ్డంగా వాడి పారేసిన తర్వాత త్రోసి పడేస్తాడు”  అని. ఆమె భర్త “మీ ఆడవాళ్ళు మాత్రం తక్కువా!  కాస్త అందంగా కనబడితే చాలు చటుక్కున ప్రేమించేస్తారు.డ్రెస్ మార్చినట్లు మార్చి పడేస్తారు” అని. మాటలతో యుద్ధం చేసుకుంటున్న వారిని వారి పాటికి వదిలేసి  అసలీ అందానికి ప్రేమకి అవినాభావన సంబంధం ఏమిటీ ?  అని ఆలోచించసాగాను.

అసలందమంటే యేమిటీ ? అందాన్ని నిర్వచించలేము. కవులయితే పోలికలతో చెప్పగలరేమో ! ఒకోసారి కవి దృష్టి పథానికి  కూడా గోచరించని నిర్మలమైన సౌందర్యాన్ని కనులు..  కాదు కాదు  హృదయం మాత్రమే కనుగొనగలవు. ఓ సినీ కవి తన ఇంటర్ వ్యూ లో తన జీవన ప్రయాణంలో అందమైన అమ్మాయి కనబడినప్పుడల్లా ఆమెతో పీకల్లోతు  ప్రేమలో పడిపోయానని చెపుతుంటే “వీడి ముఖం తగలెయ్య, ఎంతమందిని ప్రేమిస్తావురా, అసలు వీడికి పెళ్ళై౦దో  లేదో , అయితే దాని బొచ్చెలో రాయే! ఇలాంటివాడిని కట్టుకున్నందుకు” అని  మా ప్రక్కింటావిడ తిడుతుంటే  ఉలికి పడి బాహ్యప్రపంచాలోకి వచ్చిపడ్డాను. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా కాళ్ళు వెళ్ళకూడదు కదా అని.

నిజానికి ఆ కవి మాటల్లో అతిశయోక్తి లేదనిపించింది నాకు.  అలా అందాన్ని తమదైన సృహతో గుర్తించి,ఆస్వాదిస్తే తప్ప వారు అలా అన్నేసి  ప్రేమ,శృంగార  గీతాలు వ్రాయలేరని  అనిపిస్తూ ఉంటుంది . కొందరు పురుషులు స్త్రీలందరిలోనూ అమ్మని చూస్తే కొందరు పురుషులు కావ్యనాయకి ని చూస్తుంటారు అది వారిలో ఉన్న చిత్తప్రవృత్తులే కారణం అని అర్ధం చేసుకోవచ్చు .   బయటకి చెప్పం కానీ  ఎవరికీ వారు స్వీయానుభవంలో,అనుభూతిలో సౌందర్యాన్ని తదాత్మయం చెంది ఉంటారు.

ఇక నా స్వీయానుభం  ఒకటి చెప్పదలచానిపుడు. సౌందర్యాన్ని అలౌకిక ఆనందంతో చవిచూసిన సందర్భానికి అక్షర రూపం ఇది. ఒకానొక ప్రయాణంలో ..చీరాల టు విజయవాడ ప్రయాణంలో వేసవి కాలం సాయంత్రపు యె౦డకూడా నిప్పులు చెరుగుతున్నట్లే ఉన్న సమయంలో ట్రాక్ మరమత్తుల నిమిత్తం  రైలు వేగం నెమ్మదించింది.  ధారాళంగా కారుతున్న చెమట చికాకుల మధ్య ఓ మధురమైన కంఠ స్వరం వలవేసి నన్ను అటువైపు లాక్కెళ్ళింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. “రాగాల సిగలోన సిరి మల్లివి,సంగీత గగనాన జాబిల్లివి ” అంటూ అతను పాటనందుకున్నాడు. నేను అప్రయత్నంగా సీట్ నుండి లేచి తర్వాత ఆ సీట్  ఎవరో ఆక్రమిస్తారని తెలిసికూడా అతని  వైపుకి వెళ్లాను. అతను అర్ధనిమీలిత నేత్రాలతో యేపాటి బిడియం సంకోచం లేకుండా యేవాయిద్యాల సహకారం లేకుండా ఆనందంగా  పాడుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడూ పాటలు వింటూ అనేక గళమాధుర్యాన్ని  వీనుల విందుగా ఆస్వాదించిన నేను  ఆ సమయంలో అంతటి మధుర స్వరం అంతకు ముందెన్నడూ విన్నట్టు ఇక ముందు కూడా వింటానో లేదో అన్నట్టుగా  ఆ రసస్వాదనలో మునిగి పోయాను. పాట వెంబడి పాట. ఆ స్వర తుషారానికి వడ్లపూడి మల్లెల పరిమళం అల్లుకున్నట్లు అనిపించింది. రైలు వేగమందుకుని ఎప్పుడు కృష్ణా కెనాల్ పైకి వచ్చిందో తెలియదు. ఆ ఇనుప వంతెనపై రైలు నడిచే  కరకు శబ్దాలు  అతని గాన ఝరికి అడ్డుకట్ట వేసినట్లైంది   నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చిపడ్డాను. “చాలా మంచి వాయిస్, చక్కని పాటలు పాడారు, థాంక్స్ అండీ ” అన్నాను. అతని పెదాలు సన్నగా నవ్వాయి. ఇకపై సంభాషణ ఏమీ జరగలేదు. అతను నేను  చేస్తున్న  ప్రయాణం ఇంకా కొనసాగితే బాగుండుననిపించింది. స్నేహితులతో మాట్లాడుతున్నాప్పుడు అతని మాటలు విన్నాను. పాట పాడినట్లే ఉన్నాయి  ఆ మాటలు కూడా ! తర్వాత విజయవాడలో దిగిపోయి జనప్రవాహంలో కలిసిపోయాం.

యేళ్ళు గడిచినా అతని అందాన్ని ఇప్పటికీ కళ్ళ ముందుకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను ..ఊహూ..అసలు సాధ్యం కాదు. అతనిప్పటికీ నాకు గుర్తు ఉండటానికి కారణం గళ సౌందర్యమేనా?  అతని అందం విశాలమైన ఆ కనుదోయలో ఆ కనుబొమలలోనూ ఉందా ?  ఆ గడ్డం నొక్కులో ఉందా ? నవ్వకపోయినా నవ్వినట్లు ఉండే ముఖ కళవళికలోనా, నవ్వినప్పుడు కనబడే తెల్లని పలువరసలోనా ..లేకపోతే తలుపుకి ఆనుకుని ఒంటి కాలితో నిలబడిన తీరులోన (style) .. లేకపోతే అతను కనులు మూసి తన్మయత్వంతో పాట పాడే తీరులోనా లేక గళమాధుర్యంలోనా ,లేక  రమేష్ నాయుడు స్వరాలలోన,   డాక్టర్ సి.నారాయణరెడ్డి పదాలలోన, లేక  ఆ పాటలో నటించిన శ్రీవిద్యలో అణువణువునా నిండిన అందం గుర్తుకు వచ్చిన జ్ఞాపకం లోనా ? ఏమో ..అసలు చెప్పలేను . ఆనాటి పాట  బాలు గళాన్ని  మరిపింపజేసింది ఎంతగా అంటే ..అప్పుడతను పాడిన  పాటలని ఎపుడైనా   వింటున్నప్పుడల్లా  అతని సమ్మోహన గళమే   ఈ స్వరాలై  నన్ను వేటాడుతూ ఉంటుంది. బహుశా సౌందర్యమంటే అదే అనుకుంటాను.

ఇప్పటికీ ఎప్పటికీ అతని రూపు రేఖలని నేను వర్ణించలేను. కానీ నేను మేధోపరంగానూ,మనసుతోనూ, హృదయం తోనూ అనుభంలోకి వచ్చిన సౌందర్యం అది. హటాత్తుగా అతనెదురైనా అతన్ని గుర్తించలేకపోవచ్చు కూడా !  ఆ క్షణంలో ఆ అనంత సౌందర్యాన్ని నేను అనుభవించాను.  ఆ క్షణాలని అపురూపంగా  ప్రేమించాను. ప్రేమించిన అనుభూతిని అనుభవించాను. సౌందర్యం సహజమైనది,  సంస్కారం వంతమైనది. సాన పెట్టినది కావడం వలెనే అది వజ్రంలా కాంతులీనుతూ ఇప్పటికి అదీ సున్నితంగా కోసేస్తూ ఉంటుంది అని నా అనుభవం. నదిలా ప్రవహించే సంగీతంలో అతని స్వరమొక పిల్ల కెరటం.  అయాచితంగా అతని గానామృతాన్ని ఆస్వాదించడమే ఒక సౌందర్యానుభవం.

ఒక అనుభూతి,ఒక ఆస్వాదన.ఒక జీవితానుభవం  ..ఇదే అనంత సౌందర్యం నా దృష్టిలో .  క్షణ క్షణం పుడుతూనే ఉంటుంది చస్తూనే ఉంటుంది.లోలోపలికి ఇంకి పోతూనే ఉంటుంది. కనబడే వెలుగై కాంతులీనుతూ ఉంటుంది.

C43516B0-A207-40C0-866B-C4A3C39E37F5

రెండు అరణ్య ప్రయాణాలు

EAD0ABDB-8B44-407C-9847-3E37778A4E93చిమ్మ చీకటిలోనూ ..వెన్నెల కాంతులలోనూ అరణ్య శోభని కనులారాకాంచాలని ఎడతెరుగని కోరిక. నీలి కెరటాలపై పై పైకి తేలివచ్చే చంద్రుడిని, తీరం వొడ్డున విరిగి పడే అలల సవ్వడిలో చూడటం ఓ వింత అనుభూతి అయితే రేయీ పగలు ఏదైనా .. చీల్చుకునివచ్చే కిరణాల వెలుగులో కూసింత వెలుగు మరింత నీడలో అడవులలో తిరగడం ఓ సాహసమైన ప్రయాణమే ! నిశ్శబ్ద సంగీతం అంటే ఏమిటో అనుభవిస్తూ అప్పుడప్పుడూ పక్షుల జిలిబిలి సంగీతాన్ని ఆహ్లాదిస్తూ ఆ అరణ్యపు దారులలో చీకటి కొసన వాహనపు వెలుగులకాంతిలో ప్రయాణిస్తూ ..కదిలిపోయే అడవిని ఎక్కడ నింపుకోవాలో తెలియక తికమక పడతాము.

మొట్టమొదటి సారి నల్లమల అడవులని జోరుగా కురుస్తున్న వర్షంలో దోర్నాల నుండి కర్నూలు జిల్లా ఆత్మకూరు వైపు బస్ లో వెళుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను . ఉదయకాంతి వ్యాపిస్తున్నా భానుడు కానరాని ఆకాశంలో కారు మబ్బులు కరి రాజులా మందగమనముతో నడుస్తున్నాయి .రోడ్డికిరువైపులా మనిషి కాళ్ళు రెండూ దగ్గర పెట్టుకుంటే ఉండేంత దగ్గరగా ఒరుసుకుంటూ ఆకాశం వైపుగా దట్టంగా పెరిగిన వృక్ష సముదాయం … ఆ చెట్ల కొమ్మలు రోడ్డు పై ప్రయాణిస్తున్న బస్ కి వర్షంలో తడవకుండా పట్టిన గొడుగులా అనిపిస్తే .. కొండలపై నుండి జలజలా ఉరికే వాన నీరు వరదలా మారి బస్ ని ముంచేస్తాయా అన్నట్టు భయం కల్గించాయి. కాసేపు పిసిని గొట్టు వాడి ఏడుపులా కురుస్తున్న వాన మరి కాసేపు తొండాలతో గుమ్మరించి పోస్తున్నట్లు వాన.నాలా కురిసే విశాలత్వం మీకుందా ..అని అడిగినట్లు అనిపించింది.వాన చెప్పిన రహస్యాన్ని కూడా ఆలోచనల్లో ముద్రించుకుని అలా కళ్ళు మూసుకుంటే కురుస్తున్న వాన చప్పుడు ఆరోహణావరోహణాలతో అమృతాగానంలా తోచింది మెల్లగా కళ్ళు విప్పి పైకి చూస్తే ఎన్నడూ తలవంచని ఆకాశం కూడా ఆహరహమూ తన చూపుని క్రిందికే దించి చూస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకో ! భువికి దివికి ఉన్న అనుబంధమేమిటో అన్న ఆలోచనలని భంగపరుస్తూ పెళ్లున విరిగిపడిన వృక్షం.అసంకల్పితంగా కీచుమని శబ్దంతో ఆగిన బస్సుతో పాటు ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది.తేరుకుని తలతిప్పి చూస్తే ఎండుటాకుల క్రింద దాగున్న బీజం ఆవలించుకుంటూ లేచి వొళ్ళు బద్దకాన్ని విదిల్చి అవతల పడేసినట్లు మెల్లగా పైకి లేస్తూ అబ్బురంగా తోచింది. భూమికి ఎంతో ఎత్తు లో ఆకాశం కనబడకుండా చుట్టూ ఒక్క వాహనమో లేక ఒక్క మనిషి కూడా కనబడని ఆ అరణ్యపు దారి కాస్త భయం కల్గించింది. రెండు గంటలు సాగిన ఆ ప్రయాణంలో బస్ లో ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంలో మునిగి పోయారు. దట్టమైన అరణ్యంలో నుండి బయట పడ్డాక ..అమ్మో ! ఇక్కడ నివశించే చెంచులు,గిరిజనులు ఎలా ఉంటారో అని అనుకున్నాను. అప్పుడప్పుడూ వెళ్లి చూసేయడమే కానీ నాగరిక జీవనానికి అలవాటు పడిన మనం అక్కడ జీవించడమంటే చాలా కష్టం సుమీ అనుకున్నాను . ఆ అడవి ప్రయాణాన్ని ఇప్పటికి మర్చిపోలేదు నేను.

ఇక రెండో ప్రయాణం … ప్రొద్దుటూరు నుండి విజయవాడ ప్రయాణంలో ..మైదుకూరు పోరుమామిళ్ల మార్గంలో అడవి అంచున ప్రయాణిస్తూ … తమకంతో కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండిపోయాను ఆ సౌందర్యం ఎలా ఉందంటే పౌర్ణమి వెళ్ళిన మూడోనాటి చంద్రుడు చిన్న గడ్డమున్న అందాల భరిణె మోములా ముద్దుగా ఉన్నాడు. పలుచని పాల వంటి వెన్నెల అడవంతా వ్యాపించి ఉంది.ఆ కొండ నిండు చందురుడుని అలంకరించుకున్న శశిధరుడి మోముని తలపించింది.కొండలకి ఆవలి వైపున చంద్రుడు. ఈవల వైపు ప్రయాణిస్తూ నేను. చీకటి తలుపులుగా మారి ఓరగా అరణ్యాన్ని ఆకొండక్రింద గదిలో బంధించినట్టు ఆగంతుకునిలా వెన్నెల చల్లగా జొరబడింది. తెమ్మెర కూడా ఏవో అడవి పూల పరిమాళాలని మోసుకొచ్చి ఇచ్చి పొదల నిట్టూర్పులని తిరిగి తీసుకెళుతుంది. వాటిని చేరవలసిన చోటు వరకు చేరుస్తుందో లేదో తెలియదు. మొగలి పొదలు తమ పువ్వుల పరిమళాన్నితామే భరించలేక వమనం చేసుకున్నట్టున్నాయి దారంతా ఆ పరిమళాలే !. ప్రయాణం నిమిషాలు యుగాలు గడచినట్లు భారంగా ఉంది. ఆకాశానికి అవనికి ఉన్న అంతులేని స్నేహాన్ని మరొకమారు గుర్తు చేద్దామనుకున్నట్టు గూడు విడిచిన గువ్వొకటి ఎక్కడికో ఎగిరిపోతూ కనిపించింది. . దారి ప్రక్కన ఉన్న పొదలు గుస గుసలాడుకుంటూన్నట్లు చిరుగాలి అలలకి ఆకులు కదిలిస్తున్నాయి. తెల్లని మబ్బులతో చందురుడు దోబూచులాట లాడుకుంటున్నాడు. ఆ వన జ్యోత్స్నని గాంచడానికి రెండు కళ్ళూ చాలలేదు.రోడ్డుని ఆనుకునే అక్కడక్కడా మైదానాలు లేతాకుపచ్చతో పచ్చిక నవ నవ లాడుతూ వెనక్కి జారిపోతున్నాయి.ఈ రాత్రి కాలమెరుగని నిశ్శబ్ద ప్రయాణం చేద్దాం రా … అంటూ చెలికాడిని పిలిచినట్టు వెన్నెలని తోడు రమ్మని పిలుస్తూ పైట చుట్టినాక వచ్చి తిష్ట వేసిన ముప్పై యేళ్ళ అభ్యంతరాలన్నీ మరిచి విడిచి పడి పడి పచ్చికలో ఆడుకోవాలనిపించింది.
ఓస్ ..ఇంతేనా ! ఇంతకంటే దట్టమైన అరణ్యాలని చూస్తే అప్పుడు ఇంకేమంటావో… మళ్ళీ ఇంకో ప్రయాణానికి సిద్దం చేసుకో అంటుంది మనసు. ..ఆ ప్రయత్నంలో .. ఉన్నా నేను.

అన్నట్టు మనిషి ప్రయాణం కూడా అరణ్యదుర్గమమే కదా! ఎప్పుడు ఎలా ఉంటుందో ఇసుమంతైనా ఊహించలేం కదా !

పైరగాలి వూసులు

ఓ ప్రభాత సమయాన ..
చుక్కల తోటలో విహరిస్తున్న నన్ను పరిమళపు వాన తడిపేసింది
అప్పుడు తెలిసింది అమవాస్య నిశిలో ఓ జాజి పొద ప్రక్కనే నిదరనుండి మేల్కొన్నానని.

అప్పటికే ఆకులే దోసిలై రాలుతున్న పారిజాతాలని పట్టి దేవదేవునికి హారతిస్తున్నాయి

మసక వెలుగులో ఆకశంలో ఎగురుతున్న తూనీగలు నీటి అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటున్నాయి

రెమ్మలన్నీరాల్చిన కాడలు మునపటి సౌందర్యాన్ని నేల మీద వెతుక్కోమంటున్నాయి
అక్కడ పక్షులతో పాటు తుమ్మెదలు సీతాకోకచిలకలు పాటలు పాడుతుంటే
సిగ్గిల్లి తనూ గొంతు శృతి చేసుకోబోయి విఫలమవుతుంటుంది

రంగులన్నీ వెళ్లి కొమ్మలకి అతుక్కుని రుతువులు మారిన విషయాన్ని గుర్తుచేస్తుంటే
చెంపలెమ్మట వెలిసిపోయిన జుత్తుకి నల్ల రంగుని విసర్జించాలనే సృహ పెరిగింది

పలవరింతో పులకరింతో .. నీళ్లాడే తీర్ధం ఎదురైనట్టు ఓ పచ్చని చేను కంటిముందు ప్రత్యక్షమైతే …చెట్లు లేక వెలిసిపోయిన మరు భూమి లాంటి ఎడద పై లేత పచ్చని తివాచీ పరిచినట్టు ఉంటుంది

అమ్మ ఒడినుండి జారుకుని మెల్లి మెల్లిగా దొంగలా బయటకొచ్చి తొట్లో నీళ్ళని తప తప కొడుతూ ఆడుకునే పిల్లాడిలా అయిపోతుంది మనసు.

పేరుకు పోయిన గుట్టల గుట్టల అసహనం ఆహ్లాదపు గాలికి చెదిరిపోతుంది. నిలువెత్తు పెరుగుతున్న విసుగు గోడలన్నీతృటిలో కూలిపోతాయి.

యంత్రాల్లాంటి మనుషుల యాంత్రిక భాషకి అలవాటైపోయిన మనిషికి పైరగాలి ఊసులని పెడచెవిన పెట్టిన పట్నవాసికి నగర జీవనం దీపాల వెలుగులో మిడిసిపడే మురికి కూపం అని తెలిసొస్తుంది కాస్త ఆలస్యంగానైనా! .

9B77A4A7-947E-4632-B2EA-BC4FC3A5B719